కన్యాశుల్క పద్ధతి "ధర్మశాస్త్ర విహితమైనదో కాదో" తేల్చిచెప్పండని ఉత్తరాంధ్రలోని విజయనగర పాలకుడు ఆనంద గజపతి రాజు పండితులను కోరాడట. "శాస్త్రం నిర్ణయించిన దానికంట్ అధికధనం స్వీకరిస్తే కన్యా విక్రయదోషం తప్పదు; కాబట్టి అది అధర్మమే అవుతుందని "ప్రసిద్ధ పుణ్యక్షేత్రం" కాశీలోని ఆనాటి సంస్కృత పండితులు చెప్పారట. బాల్య వివాహాలను గురించిన భోగట్టా సేకరించాలని, ఆ దురాచారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనీ, ఆ భాద్యతను గురజాడమీద పెట్టారట ఆనంద గజపతిరాజు. గురజాడవారు కూడా తన నాటకం ముందుమాటలో ప్రస్తావించారు. దీన్నే ఇతివృత్తంగా స్వీకరించి గురజాడ ఈ నాటకాన్ని 1892కి పూర్వం రాసి ఉండవచ్చు. 1892 ఆగస్టులోనే మొదటిసారి జగన్నాధ విలాసినీ సభవారిచే "కన్యాశుల్కం" నాటకం ప్రదర్సించబడింది. దాదాపు నూటపాతిక సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ నాటకం ఆదరించబడుతూ, సజీవంగా ఉందంటే అతిశయోక్తి కాదు.
కన్యాశుల్క నాటకం ఆ రంగంలో గొప్ప ప్రయోగం. వ్యవహారిక భాషకు పట్టం గట్టిన మొదటి "దృశ్యకావ్యమిది". సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలనూ, వారి కష్టసుఖాలనూ సజీవమైన వ్యవహారిక భాషలో వ్యక్తీకరించబడిన మొదటి నాటకం. "గురజాడ సృష్టించిన కన్యాశుల్కం ఆంధ్ర వాఙ్మయ ప్రపంచంలోనే కాకుండా భారతీయ భాషా నాటక వాఙ్ణయ ప్రపంచంలో ప్రధమశ్రేణిలో ప్రకృష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది..." "కన్యాశుల్క నాటకం కేవలం నాటకమే కాదు, అది యానాటి తెలుగువారి రాజకీయ, సాంఘిక, సాహిత్య జీవనమునకు అద్దం వంటిది. సంఘంలో కరుడుగట్టిన దోషములనే కాక, ప్రాచ్య పాశ్చాత్య నాగరికతా సంఘర్షణలో సంఘ పరిస్థితులు, చరిత్ర చక్కగా నిరూపించే ఒక విజ్ఞానకోశము వంటిది" అని నిడదవోలు వెంకటరావు గారన్నారు.
ఈ నాటకం ఆంధ్రదేశంలో జైత్రయాత్ర సాగించింది. రచయిత రాసిపెట్టిన ఛలోక్తులు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతించారు. నాటక సందేశంప్రజలకందింది. కన్యాశుల్క దురాచారమొక్కటేగాక, అనేక సాంఘిక దురన్యాయాలు హేళనకు గురయ్యే స్థాయికి అప్పరాయ కవీంద్రులు నడిపించారంటే అతిశయోక్తి కాదు. సామాన్య మానవులు నాటక పాత్రలై, సంఘ సమస్య నాటక ఇతివృత్తమై, ఆంధ్ర నాటక సాహిత్యంలో కన్యాశుల్క నాటకం శిరోధార్యమైంది. 1929లో బాల్యవివాహ నిషేధ చట్టం రూపుధరించడానికి కన్యాశుల్క నాటకం ఒక ప్రబలమైన శక్తినిచ్చిందంటే ఆశ్ఛర్యపడనవసరం లేదు.
- గడ్డం కోటేశ్వరరావు, సంపాదకుడు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.