Wednesday, 5 October 2016

జాక్ లండన్ రచించిన "ఉక్కుపాదం" అద్భుతమైన, ప్రతిభావంతమైన రచన. సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ వచ్చిన నవలలు అనేకం ఉన్నాయి. బహుశా ఉక్కుపాదం మొదటి సైద్ధాంతిక రాజకీయ నవల. కాల్పనిక సాహిత్యం చదివేందుకు ఇష్టపడే అనేకమంది పాఠకులు తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం లాంటి వారిని చదివేందుకు ఇష్టపడరు. "ఉక్కుపాదం" ఈ సమస్యకు పరిష్కారం చూపింది. జీవిత సత్యాలను అన్వేషించదలచుకున్నవారికి ఇది చదవటం అనివార్యం. సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడి నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి తుది పోరాటంలో తమవైపు ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అలాంటి కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం "ఉక్కుపాదం".
           ఉక్కు గట్టితనానికి, పటిష్టతకు చిహ్నం. ఉక్కుపాదం అనగానే మనకు స్ఫురించేది కఠినమైన, నిర్దాక్షిణ్యమైన అణిచివేత. పెట్టుబడిదారి వ్యవస్థను వర్ణించేందుకు ఇంతకంటే సమగ్రమైన "టైటిల్" మరొకటి స్ఫురించటం లేదు.

Tuesday, 4 October 2016

తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ "బుర్రకథ సామ్రాట్"గా ఇంత ఉన్నత స్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకునే ప్రతివాడు చదవవలసిన పుస్తకం "పింజారి". నాజరు ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను అక్షరీకరించిన డా. అంగడాల వెంకట రమణమూర్తి గారు అభినందనీయులు. సరళమైన, సహజమైన బాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు... మరింత అభినందనీయం. 
నల్లూరి వెంకటేశ్వర్లు (గౌరవ అధ్యక్షులు, ప్రజానాట్యమండలి)